
సారా రహిత గ్రామంగా అప్పయ్యపేట
● గ్రామసభలో పంచాయతీ తీర్మానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట పంచాయతీ అప్పయ్యపేట గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దామని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు తెలిపారు. గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించి ఈ మేరకు పంచాయతీ తీర్మానం చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు జరిపే ‘బి’ కేటగిరిలో అప్పయ్యపేటను గతంలో గుర్తించామని, గడిచిన మూడు నెలల నుంచి గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సారా అమ్మకాలు, నిల్వలపై నిఘా పెట్టామని, అనుమానితులను గుర్తించి బైండోవర్ చేశామన్నారు. అనంతరం జరిపిన దాడుల్లో మూడు నెలలుగా సారా విక్రయిస్తున్నట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తాజాగా నిర్వహించిన గ్రామసభలో పూర్తిస్థాయి అంచనాకు వచ్చి సారా రహిత గ్రామంగా ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. ఇకపై ఎలాంటి అమ్మకాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై నాగేశ్వరరావు, సర్పంచ్ అట్టాడ శ్రీను, దత్తత అధికారి కృష్ణ, కార్యదర్శి బంగార్రాజు, సిబ్బంది పాల్గొన్నారు.