
రైతుల భూములు పోకుండా పైప్‌లైన్ వేయాలి
● రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు
విజయనగరం ఫోర్ట్: రైతుల భూములు పోకుండా ప్రత్యామ్నాయంగా విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే గ్రీన్‌హైవే పక్కగుండా హెచ్‌పీపీఎల్ వారు పైప్‌లైన్ వేసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్‌లైన్ భూమి వినియోగపు హక్కు కోసం తీసుకునే ఉపరితల భూమిపై ఇళ్లు, తోటలు, బోర్లు, కట్టడాలు, పశువులు, కోళ్ల షెడ్లు వేసుకునే అవకాశం లేనందున మొత్తం భూమి విలువ కోల్పోతున్నందున రిజిస్ట్రార్ వేల్యూ పరిగణనలోకి తీసుకుని నాలుగు రెట్లు పెంచి ధరను నిర్ణయించి అందులో నుంచి 10 శాతం కాకున్నా 30 శాతం పరిహారం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. పండ్ల తోటలు, చెట్లు జీవిత కాలాన్ని లెక్కించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, గంట్యాడ మండల ఽ అధ్యక్షుడు కోడెల శ్రీను, రైతు సంఘం నాయకులు గణేష్, నారాయణరావు, గోపాలం, రాములు, పైడిపినాయుడు, ప్రసాద్, దాలినాయుడు, జగన్, సంగమయ్య తదితరులు పాల్గొన్నారు.