
ఉసురు తీసిన పిడుగు
పాలకొండ రూరల్: పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎన్ కాలనీ (జగన్నాథస్వామి ఆలయ సమీప) ప్రాంతంలో శుక్రవారం పిడుగు రూపంలో ఓ మహిళను మృత్యువు కాటేసింది. భర్త కళ్లముందే భార్యను విగతజీవిగా మార్చేసింది. వివరాల్లోకి వెళ్తే... గృహ నిర్మాణంలో భాగంగా కటుంబసభ్యులు సూర్యనారాయణ, కృష్ణలతో కలిసి జోగ లక్ష్మీదేవి(47) నిమగ్నమైంది. శుక్రవారం సాయంత్రం అకాలవర్షం కురవడంతో అప్పుడే కట్టిన ఇంటి డూమ్ నిర్మాణం పాడవకుండా పరదాలు కప్పేపనిలో నిమగ్నమైంది. ఉరుములు, మెరుపులు తీవ్రం కావడంతో ఇంటికి చేరుకుంది. అంతలోనే పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటున్న భర్త ఎర్రన్నాయుడిని గమనించిన లక్ష్మి జాగ్రత్త.. ఉరుములు, పిడుగులు పడుతున్నాయి.. త్వరగా ఇంట్లోకి రమ్మని చేప్పేందుకు బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. అంతే.. పిడుగు పడడంతో ఇంటి ముంగిటే ప్రాణం విడిచింది. కళ్ల ముందే జీవిత భాగస్వామి మరణించడంతో భర్త ఎర్రన్నాయుడు, కుటుంబసభ్యులు సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.