
భద్రమేనా!
సాలూరులో ఒక్కటే నిఘా నేత్రం
●నిత్యం రద్దీగానే ఉంటున్నా...
పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 103 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ కేవలం మూడు సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి ఎక్కువగా ఉంటుంది. నిఘా నేత్రాలు ఉన్నప్పటికీ.. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా కళాశాలలు వదిలే సమయంలో విద్యార్థులు గంటల కొద్దీ ఇక్కడే తిష్ట వేసి, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. కాలేజీ విద్యార్థులు, విద్యార్థినుల ప్రవర్తన కొన్ని సందర్భాల్లో శ్రుతి మించుతోందని అంటున్నారు. మరోవైపు రద్దీ సమయంలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. నిఘా మరింత పెంచాలని కోరుతున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ రూరల్: జిల్లాలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్సెలన్నీ ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉన్నవే. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి చోట ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. మరికొన్ని ప్రాంతాల్లో కెమెరాల జాడే ఉండటం లేదు. ఫలితంగా జేబు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతర్‌రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా సైతం జోరుగా సాగుతోంది. బస్సుల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద తనిఖీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. చాలామంది ప్రయాణికులు బస్సులు ఎక్కాలన్న ఆత్రంతో ఉంటారు. ఇదే సందర్భంలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లను, ఇతర విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్టు ఉంటున్నా.. సేవలు నామమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
●భద్రత డొల్ల..
డివిజన్ కేంద్రం పాలకొండలో 1990వ దశకంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పాటైంది. దాదాపు 100కు పైగా ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయి. ఇందులోనే పార్సిల్ సర్వీసులకు సంబంధించిన కార్గో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిత్యం 73 ఆర్టీసీ, మరో 22 హయ్యర్ బస్సుల ద్వారా వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సగటున రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మేర రోజువారీ ఆదాయం లభిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ప్రయాణికుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తరచూ కాంప్లెక్స్‌లో జేబుదొంగ లు, అగంతకులు చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై కేసులు కూడా నమోదైన ఘటనలు ఉన్నా యి. దీనికి తోడు రాత్రి సమయాల్లో అల్లరి మూక లు, మందుబాబులు కాంప్లెక్స్‌ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రయా ణికులను బస్సులు ఎక్కించే ఈ ప్రాంతంలో భద్రత డొల్లతనం ఎప్పటికప్పుడే బయటపడుతోంది. ఇది వరకే ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. రెండు రోజుల కిందట మరలా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు ఇంకా చేపట్టలేదు.
ఒడిశాకు సరిహద్దున ఉన్న సాలూరు డిపో నుంచి నిత్యం 70 బస్సులు తిరుగుతుండగా.. సుమారు 15 వేల మంది ప్రయాణికులు రోజూ గమ్యస్థానం చేరుకుంటున్నారు. ఒడిశాకు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ.. బస్టాండులో భద్రత చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సీసీ కెమెరా అందుబాటులో ఉంది. సాలూరు, పాచిపెంట ప్రాంతాల మీదుగా గంజాయి, నాటు సారా రవాణా పెద్ద ఎత్తున అక్రమంగా సాగుతోంది. బస్సుల్లోనూ గంజాయి తరలిపోతున్న ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి చోట నిఘానేత్రాలు లేకపోవడం గమనార్హం. దీనికి తోడు చీకటి పడితే కాంప్లెక్స్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భద్రత ఎంత?
చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలు..
అరకొరగా సీసీ కెమెరాల పనితీరు

భద్రమేనా!

భద్రమేనా!

భద్రమేనా!