
జిల్లాలో 16 టైలరింగ్ శిక్షణ కేంద్రాలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా, మండల అధికారుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో కేంద్రంలో 144 మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. శిక్షణ 90 రోజుల పాటు ఉంటుందని, శిక్షణ అనంతరం సర్టిఫికెట్, కుట్టు మిషన్ అందించనున్నామన్నారు. ఎంపీడీఓలు శిక్షణ కేంద్రాలను తనిఖీ చేసి శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు.
సీసీఆర్‌సీ కార్టులు డ్రైవ్ మోడ్‌లో చేయాలి
సీసీఆర్‌సీ కార్డులు డ్రైవ్ మోడ్‌లో చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు. రైతు ఆధార్ కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరమైన పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా వెంటనే దరఖాస్తు చేయించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీ వాస్తవ, పాలకొండ సబ్ కలెక్టర్, సీతంపేట ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి , డీఆర్‌ఓ హేమలత, కేఆర్‌సీసీ ఎస్‌డీసీ పి.ధర్మచంద్రా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పీఎం జన్‌మాన్ ప్రాధాన్యత
పీఎం జన్‌మాన్ ప్రాధాన్యత గల కార్యక్రమమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం జన్‌మాన్ కార్యక్రమం కింద జిల్లాలో 5,853 గృహాలను గిరిజనులకు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిలో ఇంకా 2967 గృహాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో ప్రారంభం కావాలని ఆదేశించారు.
లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేయాలి
జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా అధికారులు కృిషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రాథమిక రంగాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రాథమిక రంగాల వృద్ధిపై కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఏటా 2.20 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండే పాల దిగుబడి ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో మత్స్యసంపద మరింత పెరగాల్సి ఉందని, మార్చి 2026 నాటికి 150 లక్షల ప్లింగరింగ్ ఫిష్ లక్ష్యం కావాలని, అందుకు అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, పశుసంవర్థక శాఖల అధికారులు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.