
‘మైనార్టీ’ రుణాలకు ఆహ్వానం
పార్వతీపురంటౌన్: జిల్లాలో మైనారిటీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూ రు చేస్తోందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ వర్గాలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు బ్యాంకు ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖా స్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. దరఖాస్తుదారుని వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్థులకు రూ. 2లక్షలు ఉండాలని పేర్కొన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో స్థానికంగా ఉన్న మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లో హెచ్‌టీటీపీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు రేషన్‌కా ర్డు, ఆధార్‌కార్డు, కమ్యూనిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు స్థానిక మండల, మున్సిపాల్టీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూకు వచ్చేటప్పు డు దరఖాస్తును ఆయా కార్యాలయాల్లో సమర్పించి హాజరు కావాలని సూచించారు. మరి న్ని వివరాలకు ఫోన్ 08922 230250, 98499 01160, 799508703752 నంబర్లలో సంప్రదించాలని స్పష్టం చేశారు.
ఏపీఈసెట్‌లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. పలువురు విద్యార్థులు మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు. విజయనగరం పట్టణానికి చెందిన వై.పద్మాకర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెటలర్జి కల్ గ్రూప్‌లో కొత్తవలస గొల్లలపాలెంకు చెందిన నంబూర్ అభిషేక్ ఫస్ట్ ర్యాంక్, లక్కవరపుకోట మండలం వీరభద్రపేటకు చెందిన యేడువాక తరుణ్‌కుమార్ 6వ ర్యాంక్ సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో పార్వతీపురం మన్యం జిల్లా వీరఘ ట్టం మండలం నీలానగరానికి చెందిన తుమ్మలపల్లి అమూల్య 8వ ర్యాంక్ సాధించారు.
ప్రభుత్వ భూములు కాపాడాలి
పాలకొండ రూరల్: మండలంలోని కొండాపురంలో గల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడంతో వాటిని కాపాడాలని అదే గ్రామానికి చెందిన కరణం మురళి ఆమరణ దీక్షకు దిగారు. ఈ మేరకు గురువారం పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మురళి విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో 30 సెంట్ల గ్రామకంఠం, 40 సెంట్ల రుద్రభూమి కొందరు వ్యక్తుల ఆక్రమణలో ఉందని, గడిచిన ఐదు నెలలుగా ఈ ఆంశమై మండల స్థాయి మొదలు రాష్ట్ర సీసీఎల్‌ఏ వరకూ పలువురు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఫలితం లేకపోవడంతో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.