
అనంత లోకాలకు
నవ్వూతూ.. నృత్యం చేస్తూ..
పాలకొండ రూరల్: అప్పటివరకూ పెళ్లింట సందడి చేస్తూ..సహచరులతో కలిసి సంతోషంగా గడుపుతూ..స్నేహితులు, బంధువులతో కలిసి నృత్యాలు చేస్తూ కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో అంతవరకూ ఎంతో సందడిగా ఉన్న ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలంలోని భాసూరు గ్రామంలో బుధవారం ఓ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి సయమంలో సౌండ్ బాక్సుల్లో పాటలకు అక్కడి వారు నృత్యాలు చేస్తున్నారు. వారితో కలిసి అడుగులో అడుగు కలిపిన గ్రామానికి చెందిన సుంకరి బంగారునాయుడు(40) సంతోషంగా డ్యాన్స్ చేశాడు. సహచరులను తనతోపాటు ఉత్సాహపరుస్తూ నృత్యంలో నిమగ్నమయ్యాడు. అంతలోనే ఒక్కసారిగా ముందుకు తూలి పడి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక సహచరులు డ్యాన్సులు చేస్తూ బంగారునాయుడిని గమనించారు. ఆయనకు తక్షణ సపర్యలు అందించినా చలనం లేకపోవడంతో కంగారుపడి హుటాహుటిన పాలకొండ ఆస్పత్రికి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతుని బంధువులు గుండెలవిసేలా రోదించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బంగారునాయుడు జీవనోపాధిలో భాగంగా పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణితో పాటు ఇద్దరు అమ్మాయిలు, వృద్ధులైన తల్లిదండ్రులు చిన లక్ష్ముంనాయుడు, పార్వతి ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన బంగారునాయుడి మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే బంగారునాయుడి అంత్యక్రియలకు గురువారం గ్రామస్తులంతా హాజరై తమ సంతాపం తెలిపారు.

అనంత లోకాలకు

అనంత లోకాలకు

అనంత లోకాలకు