
కళలకు ఆదర్శం నాటికలు
● ఆహ్వాన నాటిక పోటీల్లో సినీనటి జయలలిత, నరసింహారాజు
● పాల్గొన్న పలువురు సినీ ఆర్టిస్టులు
చీపురుపల్లి రూరల్(గరివిడి): నాటికలు కళలకు ఆదర్శమని సినీ నటి జయలలిత అన్నారు. గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమాలు కంటే నాటికల్లో నటించేవారు గొప్ప కళాకారులు అని అభివర్ణించారు. సినిమాల్లో కటింగులు, టేక్ ఆఫ్‌లు ఉంటాయని, నాటికల్లో ప్రదర్శనంతా ఒకే వేదికపై ఇవ్వాల్సి ఉంటుందని, నాటికల్లో నటించే వారే అసలైన కళాకారులని అన్నారు. కళలు బతికుండాలంటే నాటికలను ప్రోత్సహించాలన్నారు. ఉభయ రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీలకు తనను ఆహ్వానించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుడు నరసింహారాజు మాట్లాడుతూ ఇలాంటి మంచి నాటిక రంగాన్ని ప్రోత్సహించాలని, ప్రతీ ఏడాది గరివిడిలో ఇలాంటి సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు అలరించాలన్నారు. గరివిడి ప్రాంతానికి ఈ కార్యక్రమాలు మంచి గుర్తింపును తీసుకువస్తాయన్నారు. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ప్రతినిధులు వాకాడ గోపి, రవిరాజ్, బమ్మిడి కార్తీక్, కంబాల శివ, వాకాడ శ్రీనివాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులుతో పాటుగా అతిథులుగా జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్ రవితేజ, అరుణ తదితరులు హాజరయ్యారు.
సందేశాత్మక నాటికలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా గరివిడి శ్రీరాం హైస్కూల్ ఆవరణంలో గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మక వివరణతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన చిగురు మేఘం నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఉన్నత చదువులైన మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్‌లుగా ఎదిగి పట్టణాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ధనార్జన ధ్యేయం కాకుండా గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించి ప్రజలను కాపాడటమే వైద్యుడి ప్రధాన కర్తవ్యం అన్న సారాంశంతో చిగురు మేఘం నాటిక ముగుస్తుంది. హైదరాబాద్ కళాంజలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతేరాజు నాటిక మంచి సారాంశాన్ని అందించింది. గుండెసూది నుంచి విమానం వరుకు ఏ వస్తువు తయారీ చేసిన వస్తువు రేటు నిర్ణయిస్తున్నారు. రైతే రాజు, దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు పండించిన పంటకు రేటు నిర్ణయించుకునే హక్కు లేదు. రైతుకు గుండె మండి వ్యవసాయానికి సెలవు ప్రకటిస్తే ఏమి తిని బ్రతుకుతారు, రైతుల గోడు పట్టించుకోమని చెప్పే సారాంశంతో నాటిక సమాప్తం అవుతుంది. అదే విధంగా పాలకొల్లుకు చెందిన నటీనట సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన అనూహ్యం నాటిక ఆకట్టుకుంది. కొడుకులు వారసత్వ సంపదను అనుభవించటం కోసం ఎదురు చూడకుండా స్వయంకృషితో జీవించాలనే సందేశశంతో అనూహ్యం నాటిక ముగుస్తుంది.

కళలకు ఆదర్శం నాటికలు

కళలకు ఆదర్శం నాటికలు

కళలకు ఆదర్శం నాటికలు