
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లుండాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే విధంగా ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయనగరం మండల కేంద్రం ఎదుట సంఘం క్యార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు రెండు టీచర్ పోస్టులకు తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, పీడీ పోస్టులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్ధులు దాటిన చోట రెండవ సెక్షన్ ఇవ్వాలని కోరారు. 12వ పీఆర్‌సీ వేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం వినతిపత్రాన్ని మండల అధికారికి అందజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, పీవీప్రసాద్, మజ్జి రమేష్, గురుమూర్తి, మర్రాపు శ్రీనివాసరావు, తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సంపూర్ణలత, పి.లత, కె.శ్రీనివాసన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్