కుమిలిలో మైనింగ్‌ ప్రాంతం పరిశీలన

- - Sakshi

పూసపాటిరేగ: మండలంలోని కుమిలి కొండ సర్వే నంబర్‌1లో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని రెవెన్యూ, అటవీ, మైనింగ్‌శాఖల అధికారులు సంయుక్తంగా శుక్రవారం పరిశీలించారు. గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఫారెస్ట్‌ రేంజర్‌ పి.అప్పలరాజు, సర్వే ఇన్‌స్పెక్టర్‌ జ్ఞానేశ్వరరావు, తహసీల్దార్‌ ఇ.భాస్కరరావు, సెటిల్‌మెంట్‌ అధికారి కె.వెంకటరమణ, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాం పీటర్‌ల బృందం పరిశీలించి క్వారీయింగ్‌ జరిగిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. కుమిలి కొండ సర్వే నంబర్‌ 1లో 428.70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దానిలో కొంత మేర నిబంధనల మేరకు మైనింగ్‌కు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి, సిరుగుడు గోవిందరావు పేరిట 2.5 హెక్టార్లు, దల్లి గౌతమరెడ్డి పేరిట 7 హెక్టార్లకు మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారు. వాటిలో ఫారెస్టు అధికారులు ఫారెస్టుశాఖకు చెందిన భూములలో కొంత మేర తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేశారు. దీనిపై పూసపాటిరేగ తహసీల్దార్‌ ఇ.భాస్కరరావు స్పందిస్తూ మైనింగ్‌ జరుగుతున్న భూములు అనుమతులు వున్న రెవిన్యూశాఖకు సంబంధించినవేనని, ఫారెస్టు అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారన్నారు. గెజిట్‌లో ఫారెస్టు భూములుగా ఉన్నాయని అని, రికార్డుల్లో రెవెన్యూ భూములుగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు. సర్వే పూర్తయితే ఫారెస్టు, రెవెన్యూశాఖలకు సంబంధించిన భూములకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ పరిశీలనలో మండల సర్వేయర్‌ గణపతిరావు, అటవీశాఖ బీట్‌ అధికారి సమత తదితరులు ఉన్నారు.

రెవెన్యూ భూములే అంటున్న ఆ శాఖ అధికారులు

సర్వే చేసి నిర్ధారించాలంటున్న అటవీశాఖ అధికారులు




 

Read also in:
Back to Top