
సీతానగరం: మండలకేంద్రంలోని కమలా తోటకాలనీలో కోడిగుడ్ల కోసం కోళ్లగూడులో చొరబడిన నాగుపాము ఇంటియజమాని కంటపడడంతో హతమార్చాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన వై గోవిందరావు ఇంటివద్ద కోళ్లగూడులో గుడ్ల కోసం నాగుపాము చొరబడింది. కోళ్లగూడు నుంచి శబ్దం రావడంతో పాము చొరబడుతున్నట్లు గుర్తించిన ఇంటియజమాని బయటకు పంపించడానికి ప్రయత్నం చేసినా శబ్దం చేయడంతో ఫలితం కానరాలేదు. దీంతో కర్రతో హతమార్చారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
పార్వతీపురం: గుమ్మలక్ష్మీపురం మండలం డొంగరి కెక్కువ గ్రామానికి చెందిన కోలక కిశోర్ పాము కాటు వేయడంతో శుక్రవారం మృతి చెందా డు. పొలానికి వెళ్లిన కిశోర్ పాముకాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కురుపాం పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానిక అయ్యన్నపేట కామాక్షీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిర్మల (60) గత నెల 30వ తేదీన ఇంటి నుంచి బయటకు పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చింది. రామవరం నుంచి విజయనగరం వైపు వస్తున్న క్యాబ్ ఆమెను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై మురళి చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తి..
విజయనగరం క్రైమ్: స్థానిక రింగురోడ్డులో సాయి ఆలయం సమీపంలో సుమారు 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపారు. స్థానిక మహిళా పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 వాహనంలో తరలించి కేంద్రాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసు లు పేర్కొన్నారు. మృతదేహాన్ని కేంద్రాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని ఎవరైనా గుర్తిస్తే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
