జిల్లా విద్యాశాఖాధికారి
షేక్ సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడీయల్ శిక్షణతో నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 11 శాతమే ఫెయిల్ అయ్యారని, సమష్టి కృషితో వారందరినీ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది, నూరు శాతం సాధించిన జిల్లాగా అగ్రస్ధానంలో నిలుపవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం స్టడీమెటీరియల్‌తో కూడిన 20 రోజుల ప్రణాళికను ఇచ్చిందని, దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరినీ తరగతులకు హాజరయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, తెనాలి ఉప విద్యాశాఖాధికారి శాంతకుమారి, డీసీఈబీ కార్యదర్శి ఏ.తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: జలధార–జలహారతి పనులు త్వరగా ప్రారంభం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జలధార, పీజీఆర్‌ఎస్, రీ సర్వే, ఉపాధి హామీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జలధార– జలహారతి పనులు మంజూరైనప్పటికీ, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతున్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయన్నారు. పనులు త్వరగా ప్రారంభం చేయడమే కాకుండా వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై 48 గంటలలో చర్యలు చేపట్టాలని అన్నారు. జన గణన వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం చేసుకుంటూ చేయాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
దివ్యాంగులకు ఉపకరణాలను జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కటి రూ.15 వేలు విలువ గల పరికరాలను అందించారు. ఉపకరణాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య అభ్యసనానికి కృషి చేయాలని జేసీ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప పాల్గొన్నారు.


