జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
బెల్లంకొండ: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మండల వ్యాప్తంగా సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, న్యూట్రి గార్డెన్లు, సెరీకల్చర్ విధానాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్‌లను ఏర్పాటు చేయాలని, అధికారులు తమ పరిధిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
న్యూట్రి గార్డెన్, కిచెన్ గార్డెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, డ్రామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ నారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రయ్యకుంట పనులు పరిశీలన
రాజుపాలెం: జలధార పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని రెడ్డిగూడెం పరిధిలోని భద్రయ్యకుంటలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నెలలో చెరువుకుంట పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. రాజుపాలెం సమీపంలో జ్యోతి నాగేశ్వరరావు సూర్య మండల నమూనాను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ పొత్తూరి వెంకటనారాయణ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి,ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


