అన్నదాతకు అందని సేవలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అందని సేవలు

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లో నిలిచిన పరీక్షలు నకిలీ విత్తనాలు, పురుగుమందుల జోరు నష్టపోతున్న అన్నదాతలు కూటమి ప్రభుత్వం అశ్రద్ధ

ల్యాబ్‌ టెక్నీషియన్‌ సెలవులో ఉన్నారు

నాదెండ్ల: వ్యవసాయం లాభసాటిగా జరగాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులే కీలకం. విత్తనం బాగుంటే నాణ్యమైన పంట, సరైన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. నాణ్యమైన పంట దిగుబడులతో అన్నదాతల మోముపై చిరునవ్వు చూడాలనే సంకల్పంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. నాబార్డ్‌ సౌజన్యంతో రాష్ట్రంలో 147 డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లలో విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల నాణ్యత పరీక్షలు నిర్వహించి నకిలీల బారి నుంచి రైతులను కాపాడేందుకు ఏర్పాట్లు చేసింది. డీఎన్‌ఏ ప్రింట్‌ టెక్నాలజీతో విత్తన జన్యు పరీక్ష, ఎరువులు, పురుగుమందుల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ నిర్ధారణ పత్రాలు అందించే ఏర్పాటు చేశారు. రైతులు తాము సాగు చేయదలచిన పంట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో పరీక్షించుకునేవారు. దీంతో నకిలీల బెడద నుంచి తప్పించుకుని నాణ్యమైన వాటినే వినియోగించేవారు. నెలకు సరాసరి 50 పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. అప్పట్లో రైతులకు విస్త్రతంగా ల్యాబ్‌ ద్వారా సేవలందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఉదాసీనతతో అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు రైతులకు సేవలందించటంలో వెనుకబడిపోయాయి.

పనిచేయని అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌

2021 జులై 8వ తేదిన అప్పటి మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలోని నూతన మార్కెట్‌ యార్డులో రూ.80 లక్షల వ్యయంతో డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ల్యాబ్‌లపై సీతకన్ను వేయటంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొన్ని నెలలుగా ల్యాబ్‌ తెరవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్‌ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిపోయింది. భవనంలో ఉన్న యంత్రపరికరాలు సైతం దెబ్బతినే పరిస్దితి నెలకొంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ అమలు కావటంతో మాజీ మంత్రి రజిని ప్రారంభించిన శిలాఫలకానికి నల్లరంగు పులిమారు. అప్పటి నుండి పునరుధ్ధలేకపోవటం ల్యాబ్‌ పనితీరుకు నిదర్శనంగా ఉంది.

నకిలీల బెడద

మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, పురుగుమందులు రాజ్యమేలుతుండటంతో రైతులకు నష్టాలు తప్పటం లేదు. ఒడిదొడుకుల వ్యవసాయంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుతానికి ఏమాత్రం స్పందన లేకపోవటం శోచనీయమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులకు మేలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అగ్ని టెస్టింగ్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్న టెక్నిషియన్‌ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. సెలవు ముగిశాక అగ్ని టెస్టింగ్‌ ల్యాబ్‌లో తిరిగి సేవలు ప్రారంభిస్తాం. ఖరీఫ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే సేవలను అందిస్తాం.

– టి.సరిత,

చిలకలూరిపేట వ్యవసాయాధికారి.

Advertisement
 
Advertisement
Advertisement