జిల్లాలో 24,919 మందికిగాను 21,808 మంది ఉత్తీర్ణత ఐదు శాతం ఆధిక్యంలో బాలికల ఉత్తీర్ణత జిల్లాలో పెరిగిన ఉత్తీర్ణత శాతం, తగ్గిన ఒక స్థానం
తల్లి దూరమైనా ప్రతిభ
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో బాలికలు హవా చాటారు. పల్నాడు జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 24,919 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 21,808 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 12,666 మందికిగాను 85 శాతం ఉత్తీర్ణతతో 10,770 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 12,253 మందికిగాను 90.08 శాతంతో 11,038 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. కాగా, గత ఏడాది 84.15 శాతం ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది 3.37 శాతం అధిక ఉత్తీర్ణతతో 87.52 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచింది.
సత్తా చాటిన ప్రభుత్వ బడుల విద్యార్థులు
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అచ్చంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వి.సాయినాయక్ 600 మార్కులకుగాను 592 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గిరిజన సంక్షేమ పాఠశాల (వినుకొండ) విద్యార్థి వీఎస్‌ఎస్ పార్థు 591, జెడ్పీ హైస్కూల్ (ఉప్పలపాడు) విద్యార్థిని ఎ.మహాలక్ష్మి , జెడ్పీ హైస్కూల్ (దమ్మాలపాడు) విద్యార్థిని కె.భార్గవి 590 మార్కులతో టాపర్లుగా నిలిచారు. జిల్లాలో అత్యధికంగా 93.51 ఉత్తీర్ణత శాతంతో శావల్యాపురం, 93.03 శాతంతో బెల్లంకొండ, 91 శాతంతో క్రోసూరు, 90.59 శాతంతో మాచవరం మండలాలు నిలువగా, అత్యల్పంగా రెంటచింతల 65.79, కారంపూడి 68.76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో బీసీ సంక్షేమ పాఠశాలలు 92.7 శాతం, కేజీబీవీ 89.14, ఏపీ మోడల్ స్కూల్స్ 89.14, ఆశ్రమ పాఠశాలలు 85.95, సోషల్ వెల్ఫేర్ 84.78, గురుకుల 84.62, జెడ్పీ హైస్కూల్స్ 81.5, ఎయిడెడ్ 79.51, మున్సిపల్ 78.73, ప్రభుత్వ 75, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 73.94 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
నరసరావుపేట రూరల్: తల్లి మరణాన్ని తట్టుకుని పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించింది కోటప్పకొండ జెడ్పీ హైస్కూల్ విద్యార్ధిని నేలపాటి చంద్రిక. వినుకొండ మండలం ఉమ్మడివరానికి చెందిన చంద్రిక కోటప్పకొండలోని కాకతీయ సత్రంలోని వసతి గృహంలో ఉంటూ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. పది పరీక్షలకు నాలుగు రోజుల ముందు ఇంటి సమీపంలో పాము కాటుకు చంద్రిక తల్లి నాగమణి మృతి చెందింది. ఆ బాధను దిగమింగి పది పరీక్షలపై దృష్టి సారించింది చంద్రిక. గురువారం విడుదలైన పది పరీక్ష ఫలితాలలో 582 మార్కులు సాధించింది. చంద్రికను సత్రం నిర్వాహకులు, ఉపాధ్యాయులు అభినందించారు.


