నేటి నుంచి 31వ తేదీ వరకు ఇళ్ల గణన ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం సురక్షితం ప్రజలందరూ కచ్చితమైన వివరాలను మాత్రమే అందించాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట రూరల్: జనగణన– 2027ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అధికారులతో గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జనాభా గణన ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 23వేలకు పైగా స్వీయ గణనాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సారి జనగణన పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ఎక్కడా కాగితంపై రాసే పని ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో 3,824 మంది ఎన్యుమరేటర్లు, 668మంది సూపర్‌వైజర్లను నియమించినట్టు తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు సుమారు 150 నుంచి 160 ఇళ్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. జనగణన ప్రారంభించే ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతం లే అవుట్‌ను సిద్ధం చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందన్నారు. సెన్సస్ చట్టంలోని సెక్షన్ 15, 11 ప్రకారం ఈ సమచారాన్ని ఎవరికి బహిర్గతం చేయరని, ఇది ఆర్టీఐ పరిధిలోకి కూడా రాదని స్పష్టం చేశారు. సరైన సమాచారం ఇవ్వడం వలన భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించేందుకు వీలవుతుందని తెలిపారు. జనాభా గణణనలో వివరాలు ఇవ్వడం వలన ప్రభుత్వ పథకాలు కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా కచ్చితమైన సమాచారాన్ని ఎన్యుమరేటర్లకు అందించాలని కోరారు. జనగణనలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం 1855 నెంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు.


