జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జాషువా సమావేశ మందిరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక జాతి అభివృద్ధికి కొలమానం ఆ జాతి సీ్త్ర సాధించిన ప్రగతి అని దాదాపు వందేళ్ల క్రితమే దళిత మహిళలతో అంబేడ్కర్ సంఘం ఏర్పాటు చేశారన్నారు. సామాజిక న్యాయం, మహిళా సమానత్వం కోసం అధికరణలను రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో రెండు పీహెచ్‌డీలు, మూడు మాస్టర్స్‌తోపాటు అనేక హనరరీ సర్టిఫికెట్లు పొందారన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ప్రతి విద్యార్థికి ‘పిల్లల కోసం రాజ్యాంగం’ అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశామన్నారు. చట్ట సభల పని తీరు గురించి తెలియజేసేందుకు విద్యార్థులతో అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. రూ.12 కోట్ల మేరకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించామన్నారు. జిల్లాలో స్టడీ సర్కిల్ కోసం ప్రతిపాదన పంపుతామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నియోజకవర్గంలో 2 వేల ఎస్సీ గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నామని చెప్పారు. ప్రతి మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించేలా ఆదేశాలిస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అంబేడ్కర్ కారణంగా అభివృద్ధి చెందిన దేశాలకు సైతం వందల ఏళ్ల తర్వాత కానీ దక్కని అందరికీ ఓటు హక్కు భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే దక్కిందన్నారు. అంటరానితనం రూపుమాపైందన్నారు. తనకు అన్యాయం చేసిన వ్యవస్థ మీద ద్వేషం పెంచుకోకుండా వ్యవస్థను మార్చేందుకు కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. తన పోరాటంలో ప్రజలను ఏకీకృతం చేశారే కానీ విభజించలేదని పేర్కొన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అన్నారు. జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


