ఇరువురికి గాయాలు
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి గాయాలయ్యాయి. వినుకొండ – వెల్లటూరు మధ్యలో ఉన్న కురవ దగ్గరలోని పార్కు సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వర్లు (27) మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మృతుడు చింతపల్లి వెంకటేశ్వర్లుకి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నేడు కలెక్టరేట్‌లో
ప్రత్యేక పీజీఆర్‌ఎస్
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం శనివారం ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా వర్గాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్(27), జెట్టి అజయ్(17), మేడికొండ అఖిల్‌బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్‌కుమార్(24) స్నేహితులు. అజయ్, అఖిల్‌బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. రాజ్‌కుమార్ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్‌ఫోన్ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్‌పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్‌కుమార్ నడుపుతుండగా వెనుక అజయ్, తర్వాత అఖిల్, ఆ తర్వాత అన్వేష్ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గు రిని అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం, అన్వేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం
తెనాలిటౌన్: తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా–ఏపీ వ్యవస్తాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటినగర్‌లో గల మా–ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజి గణేశ్ నుంచి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటీనటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక భాధ్యత ఉందన్నారు. రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత యామి ని, చందు సూర్యను ‘మా–ఎపీ’ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు ‘మా–ఏపీ’కి కృతజ్ఞతలు తెలిపారు.


