డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట
చిలకలూరిపేట: రాష్ట్రంలో రాజకీయమంతా తిరుమల లడ్డూ చుట్టూ తిరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు ప్రభుత్వం అరితేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం ీసీపీఐ అమరవీరులు బొంతా డానియేలు, బొంతా మస్తాన్ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ లడ్డూ వ్యవహారం సైంటిస్టు తెలుస్తారని, చంద్రబాబు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. దేవుడ్ని కూడా రాజకీయాల్లో లాగి రోడ్డు పాలు చేశారని ఎద్దేవా చేశారు. తిరుమలకు వెళ్లేవారు, ప్రసాదం చేసేవారు, దాన్ని స్వీకరించేవారు కూడా హిందువులేనని, ఇందులో అన్యమతస్తులకు స్థానం లేదన్న విషయం తెలిసి కూడా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ లౌకిక పార్టీ కాదని, బీజేపీతో కలసిన అనంతరం పూర్తిగా మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పార్టీ పట్ల టీడీపీలో ఉన్న లౌకిక వాదులు అప్రత్తంగా వ్యవహరించాలని సూచించారు. సనాతన వాదం అంటూ మాట్లాడుతున్న పవన్‌న్ కళ్యాణ్‌కు సనాతన వాదాన్ని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెప్పుతున్న చంద్రబాబు వేలాది ఎకరాల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, అప్పులు చేస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి పుట్టిన బిడ్డపై సైతం రూ. 3లక్షల అప్పు ఉందన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని రెండు సంవత్సరాల గడిచినా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని ఆయన నిలదీశారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి సంకోచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల భూములను కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండి పడ్డారు. అసెంబ్లీ బూతుల మయంగా మారిందని, ప్రజా సమస్యల ప్రస్తావనే రావడం లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నంచటం లేదని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాల, మతాల మధ్య రగ్గి రాజేస్తున్నదని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ. మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.


