
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సకాలంలో పూర్తిచేయండి
నరసరావుపేట: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయం నుంచి ఎయిడ్స్ నియంత్రణ చర్యలపై జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీటి, ఏఆర్‌టీ, డీఎస్‌ఆర్‌సీ, లింక్ ఏఆర్‌టీ, టీఐ, ఎన్‌జీఓఎస్‌లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం పరీక్షలు పెంచాలని, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరిని ఏఆర్‌టీకి లింక్ చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ ఉన్న వారికి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేషెంట్‌కు ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా పెన్షన్‌కు దరఖాస్తు చేయాలని, ఆయా కేంద్రాలలో ఎల్‌ఆఫ్‌యూ కేసులను కూడా తగ్గించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ చైతన్య, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్, టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి
డాక్టర్ యు.మాధవీలత