
తూతూమంత్రంగా పొగాకు కొనుగోలు
అధికారుల ముందు రైతుల ఆవేదన
నాదెండ్ల: గణపవరం రెవెన్యూ పరిధిలోని నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శనివారం పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ రమేష్‌బాబు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతను బట్టి క్వింటా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.6 వేలకు కొనుగోలు చేయాల్సి ఉండగా, మొక్కుబడిగా కొంత పొగాకుకు మాత్రమే అధిక ధరకు కొంటున్నారని తెలిపారు. మిగిలిన పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. అనేక సాకులు చెబుతూ పొగాకును తిరస్కరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదంటూ వాపోయారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎస్. చంద్రశేఖర్, వీఆర్వోలు ఉన్నారు.