
విలువైన స్థలాలు లూలూకి ధారాదత్తం తగదు
సత్తెనపల్లి: రాష్ట్రంలో విలువైన ఆర్టీసీ స్థలాలను బడా కంపెనీ లూలూకి ప్రభుత్వం కట్ట పెట్టడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు విమర్శించారు. పల్నాడు జిల్లా సీపీఎం విస్తృత సమావేశం సందర్భంగా సత్తెనపల్లి కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 400 కోట్లకు పైగా విలువైన విజయవాడ పాత బస్టాండ్, ఇతర ఆర్టీసీ స్థలాలను బడా, బహుళ జాతి కంపెనీ అయిన లూలూకు మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు ఆర్టీసీ డిపోలు నడుస్తున్న ఈ స్థలాన్ని లూలూ కంపెనీకి ధారాదత్తం చేయడం అంటే ఆర్టీసీ సంస్థను, ప్రజా రవాణాను దెబ్బతీయడమే అవుతుందని తెలిపారు. ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని రవాణా, ప్రజా ఉపయోగ కార్యక్రమాలకే వినియోగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాలను లూలూ కంపెనీకి కట్ట బెడితే నగర ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని, ప్రతిఘటిస్తామని చెప్పారు. ఆర్టీసీని పరి రక్షించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్, పట్టణ కార్యదర్శి ధరణికోట విమల, మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం అప్పగించే ప్రతిపాదనలు ఉపసంహరించాలి