సీఏలకు పుష్కల అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

సీఏలకు పుష్కల అవకాశాలు

Jul 20 2025 2:03 PM | Updated on Jul 20 2025 3:13 PM

ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: చార్టర్డ్‌ అకౌంటెంట్లు (సీఏ)లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్‌ తెలిపారు. ఐసీఏఐ గుంటూరు చాప్టర్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సీఏ విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రసన్నకుమార్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఏ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఐసీఏఐ కృషి చేస్తోందన్నారు. గుంటూరులో సీఏ విద్యార్థుల కోసం ఐసీఏఐ భవన్‌ను ఆధునిక వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. సీఏ కోర్సుల విద్యార్థులకు ఐసీఏఐ స్టైఫండ్‌ ఇస్తోందన్నారు. సమావేశంలో ఐసీఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ డి.ప్రసన్నకుమార్‌, సదరన్‌ ఇండియా రీజినల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ ముప్పాళ్ల సుబ్బారావు, కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌, గుంటూరు బ్రాంచి చైర్మన్‌ చింతా రఘునందన్‌, వైస్‌ చైర్మన్‌ బి.ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వనిమిరెడ్డి వి. నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఐసీ జోనల్‌ క్యారమ్స్‌ టోర్నీ న్యాయ నిర్ణేతగా జలీల్‌

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గుంటూరుకు చెందిన ప్రముఖ క్యారమ్స్‌ క్రీడాకారుడు, ఏపీ క్యారమ్స్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ జలీల్‌ను ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ క్యారమ్స్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ 2025–26కు గాను ముఖ్య న్యాయ నిర్ణేతగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతోపాటు ఆయన జోనల్‌ క్యారమ్స్‌ సెలక్షన్స్‌ కమిటీ సభ్యునిగానూ ఎంపికయ్యారు. రాష్ట్రంలో జలీల్‌కు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కింది. జలీల్‌ ఇప్పటికే అంతర్జాతీయ రిఫరీగానూ, జాతీయ క్యారమ్స్‌ ప్యానెల్‌ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జలీల్‌కు ఆల్‌ ఇండియా క్యారమ్స్‌ సంఘం సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సంపతి, ఏపీ క్యారమ్స్‌ సంఘం చీఫ్‌ ప్యాట్రన్‌ యాగంటి దుర్గారావు, జిల్లా అధ్యక్షుడు ఎంకేవీ ప్రసాద్‌, సెలక్షన్‌ కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

మార్టూరు: జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇసుక దర్శి ఫ్లైఓవర్‌పై జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి ఉల్లిపాయల లోడుతో వెళుతున్న టాటా ఏస్‌ వాహనాన్ని అదే మార్గంలో ఝార్ఖండ్‌ నుంచి నెల్లూరు వెళుతున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో టాటా ఏస్‌ డ్రైవర్‌ చిలక మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ మహేష్‌ను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.600 కోట్లు ఎక్కడ?

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్‌ జీ

లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేస్తుందని ఈనెల 12వ తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారని, వారం రోజులు గడుస్తున్నా ఇంత వరకు విడుదల కాలేదని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్‌లో నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్‌, నగర కార్యదర్శి ప్రణీత్‌, అజయ్‌, శివ గోపి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement