
ఇంజినీరింగ్ విద్య ఒక్కటే గమ్యం కాదు
తెనాలి: విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ఒక్కటే గమ్యం కాదనీ.. అది లేకపోతే జీవితం వ్యర్థం అనే భావనలను ముందుగా తల్లిదండ్రులు విడనాడాలని కాకినాడ జేఎన్‌టీయూకే వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చేకూరి శివరామకృష్ణప్రసాద్ అన్నారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో శనివారం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన సభకు సంస్థ వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సభలో మొవ్వా విజయలక్ష్మి స్మారక నాలుగో అవార్డును తెనాలికి చెందిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు బహూకరించారు. ఇదే సభలో గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550, ఆపైన మార్కులు సాధించిన 60 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలను అందజేశారు. ముఖ్యఅతిథి డాక్టర్ శివరామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసుకుని బయటకు వచ్చేవారిలో 15 శాతం మాత్రమే ఉద్యోగాలకు అర్హులని నివేదికలు చెబుతుంటే లోపం ఎవరిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో 1.90 లక్షల కన్వీనర్ సీట్లుంటే 1.40 లక్షలు కూడా భర్తీకావటం లేదన్నారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడారు.
విద్యార్థుల చేతుల్లోనే బంగారు భవిష్యత్తు
డాక్టర్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన రీతిలో వాడుకుంటే సెల్‌ఫోన్ బ్రహ్మాస్తమని సోదాహరణంగా చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి తన ప్రసంగంలో బంగారు భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని విద్యార్థుల నుద్దేశించి అన్నారు. ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ మాట్లాడుతూ మాతృభాషలో సౌమ్యంగా మాట్లాడటం, చుట్టూ ఉన్న అందరితో సత్సంబంధాలు కొనసాగించటం, చేసే ప్రతిపనికి ఎవరికివారు బాధ్యత వహించటం అలవాటు చేసుకుంటే ఏ టెక్నాలజీ వచ్చినా ఇబ్బంది ఉండదన్నారు. డ్రగ్స్, ఆల్కహాలు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికారు.
జేఎన్‌టీయూకే వీసీ
డాక్టర్ చేకూరి శివరామకృష్ణప్రసాద్