
కళాశాల స్థలం ఆక్రమణ ఆపాల్సిందే
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: టీడీపీ నాయకులు పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమయ్యారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. కాలేజీ ప్రాంగణంలో రోడ్డు వేసిన చోట మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలతోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలంలో రోడ్లు వేసి ప్లాట్లు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి ఎవరూ నష్టపోవద్దని చెప్పారు. సుమారు 44 సంవత్సరాల క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. పిడుగురాళ్లకు తలమానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని కూడా ఆక్రమిస్తున్నారని ఇటు వంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తెచ్చామఅన్నారు. జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించేందుకు అన్ని ప్రతిపాదనలు పూర్తిచేశామని తెలిపారు. సమావేశంలో పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్ కుమార్, చింతా సుబ్బారెడ్డి, మాజీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మందా సుధీర్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.