
నంబాల ఎన్‌కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్
సత్తెనపల్లి: మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారనేది నాటకమేనని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంబాల కేశవరావు మృతి చెందారనే వార్తను తాము నమ్మడం లేదన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత రోజుల తరబడి మృతదేహాలను మార్చురీలో పెట్టుకుని, అవి కుళ్లిపోయిన తరువాత ప్రధాన నాయకుడు చనిపోయాడని అంటున్నారని పేర్కొన్నారు. కానీ అవి ఆదివాసీలు, మిలీషియా సభ్యుల మృతదేహాలని వార్తలు వస్తున్నాయన్నారు. నంబాల చనిపోయారని చెబితే కేడర్ నిరాశ, నిస్పృహలతో ఉంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నామన్నారు. ఇలా ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.