
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనుకు చెందిన ఇంటిలో మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టారు. అందులోని రూ.6.25 లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు బంగారు వస్తువులు కూడా చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వడ్లమూడిలో జరిగే శుభకార్యానికి అందరూ వెళ్లటంతో గమనించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయులకు వైద్య శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా పాయింట్లు పొందగోరు ఉపాధ్యాయులకు శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరానికి గత నెల 24, 25, 26వ తేదీల్లో నిర్వహించిన వైద్య శిబిరానికి హాజరై, సర్టిఫికెట్ పొందిన ఉపాధ్యాయులు హాజరు కానవసరం లేదని తెలిపారు. గత నెలలో నిర్వహించిన వైద్య శిబిరం తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, ఎముకల క్షయ వ్యాధి, న్యూరో సర్జరీ, కేన్సర్ తదితర వ్యాధులకు గురైన వారితో పాటు ప్రస్తుతం హేతుబద్ధీకరణకు గురవుతున్న ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు.