విజయవాడ కల్చరల్: కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఏపీ టూరిజం, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం ఆదివారం ప్రారంభమైంది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యఅతిథిగా హాజరవగా.. గోనుగుంట్ల బ్రదర్స్ నాద స్వరంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దెందుకూరి సదాశివ ఘనాపాటి, దెందుకూరి కాశీవిశ్వనాథ శర్మ వేద పఠనంతో వేద స్వస్తి నిర్వహించారు. తమిళనాడుకు చెందిన కె. ఉమాశంకర శివరామన్, తాళ వాయిద్య కచేరి నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఎన్. విజయశివ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను మధురంగా ఆలపించారు. తమిళనాడుకు చెందిన రాధాభాస్కర్ శాసీ్త్రయ సంగీత విలువలను గురించి, త్యాగరాజ స్వామి తెలుగు కీర్తనలు స్వరూపం అంశంగా ప్రసంగించి త్యాగరాజ కృతులను ఆలపించారు. కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్.అశ్వతి, ఎ.సుజనా సుధీర్ త్యాగరాజ స్వామి దివ్యనామ సంకీర్తనలను గానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముప్పవరపు సింహాచల శాస్త్రి, మహకవి పోతన హరికథాగానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కీర్తనలను గానం చేశారు. విశాఖపట్నానికి చెందిన పంతుల రమ కర్నాటక సంప్రదాయంలో పలు కీర్తనలను ఆలపించారు. తమిళనాడుకు చెందిన రామకృష్ణమూర్తి, విజయవాడకు చెందిన పేరి త్యాగరాజు వయోలిన్‌పై, ప్రమోన్ ఉమాపతి వేణువుపై, చిట్టాకార్తీక్ వీణపై పలు సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. ఏపీ సృజనాత్మక సమితి సీఈవో ఆర్. మల్లికార్జునరావు చిత్రించిన నిర్మాలా సీతారామన్ చిత్ర పటాన్ని మంత్రి రోజా ఆవిష్కరించారు.