
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా పరాయణలు ఏకాదండయ్య పంతులు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి అన్నారు. బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ఏకాదండయ్య పంతులు చారిటీస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు రాళ్ల బండి సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్థసారథి మాట్లాడుతూ 183 ఏళ్ల క్రితం గుంటూరు నగరంలో జన్మించిన ఏకాదండయ్య పంతులు తన వీలునామా ద్వారా విద్య, వసతి గృహాలు, ధార్మిక, సమాజహిత కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయల ఆస్తులు అందించిన మహానుభావుడని కొనియాడారు. గుంటూరు నగరం, జిల్లా గర్వించదగ్గ సంఘసేవ పరాయణులుగా పేర్కొనవచ్చునని అన్నారు. ఛారిటీస్ మేనేజింగ్ ట్రస్ట్ కోటంరాజు శేష చంద్రమౌళీశ్వరరావు మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు తన ప్రధాన వీలునామాలో పేర్కొన్న విధంగా ప్రతి ఏడాది ఉగాది ఉత్సవాలు, ప్రముఖులను ఆయన పేరున సత్కరించడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా చారిటీస్‌కు సేవలందిస్తున్న ప్రముఖ న్యాయవాది కొండూరి కృష్ణారావు, రాజ్యలక్ష్మి దంపతులను ఆత్మీయ అతిథులు, ట్రస్టీల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, న్యాయవాది జూపూడి రంగరాజు, డాక్టర్ దీవి హరిప్రసాద్, ట్రస్టీలు కేఎస్‌ఆర్ కుటుంబరావు, కొండూరి నంద కిషోర్, భట్రాజు కృష్ణ కిషోర్, కేసానుపల్లి శ్రీరామసుబ్బారావు, నెప్పల్లి వరప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి