రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్‌ సింగ్‌ దేవ్‌

భువనేశ్వర్‌: వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో తరచూ కాలవైశాఖి తాండవించి బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడికక్కడ చెట్లు, ఇతరేతర కట్టడాలు కూలి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు వేసవి తాపం తీవ్రత పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు విద్యుత్‌ సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా సన్నద్ధతని విద్యుత్‌ విభాగం బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ సమీక్షించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం స్థానిక లోక్‌సేవా భవన్‌లో విద్యుత్‌ శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్‌ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విశాల్‌ కుమార్‌ దేవ్‌, ఓపీటీసీఎల్‌ సీఎండీ భాస్కర్‌ జ్యోతి శర్మ, ఒడిశాలోని అన్ని డిస్కామ్‌ల సీఈవోలు హాజరయ్యారు.

ఫిర్యాదులు పరిష్కరించాలి

వేసవి కాలం, కాల వైశాఖి తుఫానుల విపత్తుపై సన్నద్ధతను సమీక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను నిర్ధారించాలని ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ డిస్కాంలను ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చే అన్ని ఫిర్యాదులను అత్యవసర ప్రాతిపదికన పరిగణించి నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. పునరావృతం అయ్యే లోపాలను నివారించడానికి పటిష్టమైన వ్యవస్థ నిర్వహణ, పునరుద్ధరణ కార్యకలాపాల్లో నాణ్యమైన ఉపకరణాలు, సామగ్రిని మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అన్నిస్థాయిల ఉద్యోగులు వినియోగదారులతో మర్యాదగా, చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు, వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించే ప్రత్యేక బృందాల సంఖ్యను పెంచాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement