డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి
భువనేశ్వర్: ఆరోగ్య సేవా రంగంలో పారా మెడికల్ సిబ్బంది పాత్ర అత్యంత ప్రాధాన్యమని, ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలు పైబడి పారా మెడికల్ సిబ్బంది అవసరం ఉందని హైటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. అందువలన ప్రపంచవ్యాప్తంగా పారా మెడికల్ నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైటెక్ అలైడ్ మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో రెండు రోజుల మెడివర్స్–2026 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ అలైడ్ సైన్సెస్ సంస్థ నుంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రోగులకు ఉత్తమ సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని ఏ మూలలో పనిచేసే అత్యుత్తమ పారామెడికల్ సిబ్బంది అయినా హైటెక్ అభ్యర్థులే అయి ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు. హైటెక్ గ్రూప్ సీఈవో, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ విద్యార్థులు మానవీయ లక్షణాలతో ఎదిగి రోగుల సేవకు అంకితం కావాలని కోరారు. హైటెక్ అలైడ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మధుస్మిత త్రిపాఠి మాట్లాడుతూ ఆరోగ్య సేవా రంగంలో పారా మెడికల్ పనితీరు విభిన్నంగా ఉంటుందన్నారు. అంకిత భావం ప్రామాణికంగా ఈ రంగంలో సేవలు అందించే వారికి ఉజ్వల భవిష్యత్ చేరువవుతుందన్నారు. కార్యక్రమానికి యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి, అనిల్ పాణిగ్రాహి, మెడికల్ కాలేజ్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ దేబానంద మహాపాత్రో, డీన్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాధా మాధవ్ త్రిపాఠి, వైస్ చైర్మన్ డాక్టర్ లీసా షడంగి, ప్రొఫెసర్ కుమరవర దాస్, సీవోవో జ్యోతిర్మి పండా, డాక్టర్ చిత్తరంజన్ సహాణి హాజరయ్యారు.


