విలువలు ఆధారంగానే విద్య | - | Sakshi
Sakshi News home page

విలువలు ఆధారంగానే విద్య

Mar 30 2026 7:28 AM | Updated on Mar 30 2026 7:28 AM

భువనేశ్వర్‌: విలువలతో కూడిన విద్య శాంతియుత, ప్రగతిశీల సమాజాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి తెలిపారు. జాతి శక్తివంతమైన పురోగతి పౌరుల సౌశీల్యంతో ముడి పడి ఉంది. విద్యార్థులలో జ్ఞానంతో పాటు శీలాన్ని కూడా పెంపొందించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా, దేశ నిర్మాతలుగా కీలక పాత్ర పోషిస్తారు. మార్గనిర్దేశం, ఆదర్శం ద్వారా యువత ఆలోచనలను తీర్చిదిద్దుతారని ఆయన ఉద్ఘాటించారు. స్థానిక రామకృష్ణ మిషన్‌ వివేకానంద హాల్‌లో ఆదివారం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన విలువ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించారు. విద్య అంతర్గత పరిపూర్ణత, బలం మరియు శీలం యొక్క వ్యక్తీకరణ అనే స్వామి వివేకానంద నినాదం మార్గదర్శకంగా విద్యాభ్యాసం, బోధన కొనసాగాలని ప్రోత్సహించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆదర్శాల నుండి స్ఫూర్తి పొంది రామకృష్ణ మిషన్‌ మేధో, నైతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను సమగ్రపరిచే సమతుల్య విద్యా వ్యవస్థను నిరంతరం ప్రోత్సహిస్తోందని గవర్నరు అభినందించారు. సంప్రదాయ విద్యా వ్యవస్థలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస బోధన విలువలు దైనందిన జీవితంలో ఆచరించాల్సిన సూత్రాలుగా పేర్కొన్నారు. సంఘర్షణలు, అస్థిరతలతో తల్లడిల్లుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అవగాహన, సహనం, సంభాషణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉదన్నారు. నిర్భయమైన ఆలోచనలతో చేతలలో కారుణ్యం, మానవ సేవకు కట్టుబడి ఉండేలా కనీసం ఒక్క విద్యార్థికై న మార్గనిర్దేశం చేయాలని గవర్నర్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పరివర్తన చెందిన ఒక్క వ్యక్తి కూడా సామాజిక మార్పుకు గణనీయంగా దోహదపడగలడని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ రామకృష్ణ మఠం కార్యదర్శి స్వామి బోధమయానంద, స్థానిక రామకృష్ణ మిషన్‌ కార్యదర్శి స్వామి ఆత్మప్రభానంద, అధ్యక్షుడు డాక్టర్‌ చండీ దాస్‌ తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement