రాయగడ: వంట గ్యాస్ కృత్రిమ కొరతను నివారించి వినియోగదారులకు సకాలంలో వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం ఈ మేరకు జిల్లాలోని గుణుపూర్‌లో సంబంధితశాఖ అధికారులు హోటళ్లు, వ్యాపార సంస్థల్లో శుక్రవారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. హోటళ్లలో వాణిజ్యపరమైన గ్యాస్‌కు వినియోగించడానికి బదులు డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు అధికారులు దాడులను నిర్వహించారు. గుణుపూర్‌లో గల పలు హోటళ్లలో అధికారులు దాడులను నిర్వహించారు. కమర్షియల్ వంట గ్యాస్‌కు బదులు డొమెస్టిక్ వంట గ్యాస్‌ను వినియోగిస్తున్న మూడు హోటళ్లలో మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గుణుపూర్ అదనపు తహసీల్దార్ అభిలాష్ శతపతి, రామనగుడ అదనపు తహసీల్దార్ దీపరాణి బెహరా, సివిల్ సప్లయ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మునిగుడలో తహసీల్దార్ ఎం.అనురాధ నేతృత్వంలో అదనపు తహసీల్దార్ బ్రజగొపాల్ దాస్, సిబ్బంది దాడులను నిర్వహించారు. రామనగుడలో తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి నేతృత్వంలో రామనగుడలో గల వివిధ హోటళ్లలో దాడులు చేపట్టారు. పద్మపూర్, గుడారి, బిసంకటక్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ దాడులను ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు నిర్వహించారు.


