
వంతెన బాగుచేయాలని వినతి
జయపురం: జయపురం సమితి పాత్రో ఫుట్ గ్రామ సమీప కొలాబ్ నదిపై గల 94 ఏళ్ల కిందట నిర్మించిన ఇనుప వంతెనకు తగిన రక్షణ, పర్యవేక్షణ లేక ప్రమాదస్థికి చేరుకుంది. వారం రోజులుగా వంతెన మరమ్మతులు చేపట్టాలని, దాని పక్కన మరో వంతెన నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని పాత్రో ఫుట్ వంతెన సురక్షా సమితి సభ్యులు తెలిపారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ ఇనుప వంతెన విజయవాడ–రాంచీ 326వ జాతీయ కారిడార్ మార్గం పాత్రో ఫుట్ సమీపంలో ఉందని, వంతెన మీదుగా జయపురం నుంచి బొయిపరిగుడ, లమతాపుట్, మాచ్‌ఖండ్ మల్కనగిరి, ఒడిశాలోని పలు ప్రాంతాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రాలకు వేలాది వాహనాలు రాకపోకలు చేస్తున్నాయని వెల్లడించారు. ప్రమాద స్థితిలో ఉన్న వంతెనపై రాకపోకలు బందు చేసే ముందు దాని పక్కనే మరో వంతెన నిర్మాణం నిర్మించేందుకు పనులు చేపట్టి, కంట్రాక్టర్ ఆ పనులు నిలిపివేసి వెళ్లిపోయాడని ఆరోపించారు. వంతెన పనులు జరిపేందుకు నేషనల్ హైవే అధికారులు మరో టెండర్ పిలిచేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. అధికారులు వెంటనే దృష్టి సారించాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో పాత్రోఫుట్ వంతెన సురక్షా సమితి సభ్యులు కేథార గౌరీదాస్, సంతోష్ పట్నాయక్, కృష్ణ కేశవ షొడంగి, బినయవజిత్ నాయక్, జితు నాయక్, జగన్నాథ్ రౌత్, రామనాథ్ దండసేన, సత్యనారాయణ సాహు, హేమంత ఖెముండు, తదితరులు పాల్గొన్నారు.