
● వరద వెతలు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ మండలం మధుపుర పంచాయతీ చెధురికుద్దొ గ్రామంలో హృదయం చలింపజేసే విచారకర సంఘటన తారస పడింది. అంత్యక్రియల కోసం మృత దేహాన్ని తరలించేందుకు గ్రామస్తులు మోకాలి లోతు నీటిలో 2 కిలోమీటర్లకు పైగా ఎదురీదాల్సి వచ్చింది. సువర్ణ రేఖ నది వరద ప్రజలను ఇలా వేధిస్తోంది. ఏటా సువర్ణ రేఖ నదికి వరదలు ముంచెత్తుతాయి. ఈ ఏడాది నది ఇప్పటికే 4 సార్లు వరదతో ఉప్పొంగింది. తాజాగా ముంచెత్తిన వరదల్లో బలియాపాల్ మండలం పరిధిలోని 6 పంచాయతీల్లో 30 పైబడి గ్రామాలు నీట మునిగాయి. సువర్ణ రేఖ నది వరదలతో ప్రజలు వర్ణనాతీతమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మధుపుర పంచాయతీ చైధురికుద్దొ గ్రామానికి చెందిన మధు ప్రమాణిక్ (54) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మరణించాడు. గ్రామం, శ్మశానవాటిక వరద నీటిలో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మృతుని కుటుంబం పూరీ స్వర్గ్ ద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది. మృతదేహాన్ని ఇంటి నుంచి గ్రామం ప్రధాన రహదారిపై నిలబడి ఉన్న స్వర్గ్ రథ్ (అంతిమ యాత్ర వాహనం) వరకు తీసుకెళ్లడానికి ముప్పు తిప్పలు పడాల్సి వచ్చింది. మృత దేహాన్ని తీసుకెళ్లడానికి మోకాలి లోతు వరద నీటిలో ఎదురీదుకుంటూ గ్రామస్తులు ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రజలు వరద సమస్యలు నిరవధికంగా ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకునే నాథుడు కొరవడినట్లు చైధురికుద్దొ గ్రామ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.