
రాష్ట్రంలో శ్వేత విప్లవం
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
భువనేశ్వర్: రాష్ట్రంలో శ్వేత విప్లవానికి ఓంఫెడ్ వెన్నెముకని, రాష్ట్ర పాడి రైతుల స్వావలంబన బలోపేతం చేసే దిశలో పాల ఉత్పత్తిని పెంపొందించడంలో ఓంఫెడ్ ప్రధాన చోదక శక్తిగా ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. రానున్న రోజుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు కామధేను పథకం ద్వారా రైతులకు అధిక దిగుబడినిచ్చే 10 వేల ఆవులను అందజేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆవు ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేస్తామన్నారు. శనివారం కటక్‌లో జాతీయ పాడి అభివృద్ధి బోర్డు, ఓంఫెడ్ మధ్య జరిగిన ఒప్పందం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఓంఫెడ్ డెయిరీ ప్లాంట్ ఉద్యోగుల కోసం 62 క్వార్టర్లను, ప్లాంటులో పాల పొడి ప్యాకింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఓంఫెడ్‌తో ఈ ఒప్పందం ద్వారా, జాతీయ పాడి అభివృద్ధి బోర్డు ఒడిశాలోని పాడి రైతులకు అధిక దిగుబడినిచ్చే గిర్, సాహివాల్, నాణ్యమైన సంకర జాతి జాతులకు చెందిన దాదాపు 3 నుంచి 4 వేల ఆవులను అందిస్తుంది. రాష్ట్రంలో గోబర్ గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ పాల సంఘాలకు రూ.7.50 కోట్ల విలువైన 2,000 నుంచి 15,000 లీటర్ల సామర్థ్యం గల 22 పాల ట్యాంకర్లను విరాళంగా అందజేశారు. రూ. 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 పాల ప్యాకింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర పాల ఉత్పత్తి 7.2 లక్షల లీటర్లు. 2036 నాటికి రాష్ట్ర పాల ఉత్పత్తి 16.5 లక్షల లీటర్లు. 2047 నాటికి ఈ పరిమాణాన్ని 17.5 లక్షల లీటర్లకు వృద్ధి చెందడం లక్ష్యంగా పాడి పశువుల పెంపకం, పాల ఉత్పాదన రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందన్నారు.
దేశంలో తలసరి పాల ఉత్పత్తి 471 గ్రాములని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రపంచంలో సగటు లభ్యత కంటే చాలా ఎక్కువ. పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు కామధేను యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 70 శాతం వరకు ఆర్థిక సహాయం అందజేసి ప్రోత్సహిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది గో సంరక్షకులకు ప్రయోజనం చేకూరుతుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో, ఈ పథకం కింద 3 లక్షల మంది లబ్ధిదారులు రూ. 71 కోట్ల సహాయం పొందారు. ఆవుల రక్షణ, నిర్వహణ, చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం గోమాత యోజనను అమలు చేసింది. ముఖ్యమంత్రి ప్రాణి కళ్యాణ్ యోజన కింద కొత్త గో సంరక్షక శాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యలు రాష్ట్రంలో తలసరి పాల ఉత్పత్తిని పెంచుతాయని సీఎం అన్నారు.
ఓంఫెడ్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం జాతీయ పాడి అభివృద్ధి బోర్డు సహకారంతో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. ఆవు పేడను బహుళ ప్రయోజనాలకు వినియోగించే దక్పథంతో ఈ ప్లాంటు పని చేస్తుందన్నారు. దీని వల్ల రాష్ట్ర గో ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య, పశువుల పెంపకశాఖ మంత్రి గోకులానంద మల్లిక్, కటక్ లోక్ సభ సభ్యుడు డాక్టర్ భర్తృహరి మహాతాబ్, ఓంఫెడ్ అధ్యక్షుడు కిశోర్ చంద్ర ప్రధాని, మత్స్య, పశువుల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ వశిష్ట్, ఎన్‌డీడీబీ డెయిరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ దేవానంద, ఓంఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అమృత్ కులంగే, ఓంఫెడ్ పాలక మండలి సభ్యులు, వివిధ పాల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో శ్వేత విప్లవం

రాష్ట్రంలో శ్వేత విప్లవం