
రాజధానిలో రగులుతున్న ఆందోళనలు
భువనేశ్వర్: పూరీ జిల్లా నిమ్మాపడా ప్రాంతంలో బాలికక నిప్పు అంటించిన సంఘటన పురస్కరించుకుని రాఽజధాని నగరంలో ఆందోళనలు రగులుతున్నాయి. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా నియోజక వర్గం కావడంతో ఆముకు భద్రతా ఏర్పాట్లు పెంచారు. శనివారం సాయంత్రం నుంచి స్థానిక రాజ్ భవన్ కూడలి నుంచి ఏజీ చౌరస్తా వరకు ఉన్న రహదారిని సీల్ చేశారు. ఈ ప్రాంతంలో భద్రత కోసం 6 ప్లటూన్ల అదనపు పోలీసు బలగాలను మోహరించారు. రోడ్డుకు ఇరువైపులా ముళ్ల కంచె, కట్టెలతో తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారుల చొరబాటు నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శాంతిభద్రతల విభాగం స్పందించింది.
ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరసన
రాష్ట్ర యువజన, విద్యార్థి కాంగ్రెస్ సభ్యులు ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఇంటి ముందు నడి రోడ్డు మీద బైఠాయించి నిరసన ప్రదర్శించారు. మరో వైపు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి బాహినీపతి నేతృత్వంలో మహిళా కార్యకర్తలు బారికేడ్‌ను అధిగమించి ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా నివాసంపై దాడికి పాల్పడి టొమాటోలు రువ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి బాహిణిపతి ఎయిమ్స్‌లో బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. వైద్య, చికిత్స వ్యవస్థని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం మహిళలను రక్షించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం ఆవరణలో బిజూ మహిళా జనతా దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.