
ప్రేమికులకు నాగలికి కట్టిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
కొరాపుట్: ప్రేమికులను నాగలికి కట్టి గ్రామంలో ఊరేగించిన ఘటన పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం లోనికి దిగింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి బొరిగి గ్రామ పంచాయితీ పెద్దఇటికి గ్రామంలో జరిగిన ఘటనపై నారాయణ పట్న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నారాయణ పట్న ఐఐసీ ప్రమెధ్ కుమార్ నాయక్ ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలను విచారణ చేశారు. ఈ విచారణలో అందరి ఆమోదంతోనే ప్రేమికులను ఊరేగించామని గిరిజన పెద్దలు ప్రకటించారు. మరో వైపు ప్రేమ జంట కూడా తమ ఇష్ట ప్రకారమే ఈ శిక్షని అంగీకరించామని ప్రకటించారు. బంధుగాం సమితిలో ఒక మంత్రగత్తె ఇచ్చిన సలహా ప్రకారమే ప్రేమికులకు శిక్ష విధించినట్లు గ్రామస్తులంతా ముక్త కంఠంతో సమాధానమిచ్చారు. వారిద్దరూ ఒకే వంశానికి చెందిన వారు కనుక అన్నా చెల్లెళ్లు అవుతారని, దాని వల్ల గ్రామానికి కీడు జరుగుతుందనే విషయం మంత్రగత్తె చెప్పిందని, ఇలా నాగలికి కట్టి ఊరేగిస్తే దోష పరిహారం జరుగుతుందని చెప్పిందని స్థానికులు తెలిపారు. ఈ విషయం పై కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత స్పందించారు. ఇలాంటి అనాగరిక చర్యలు అంగీకరించబోమన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వీ.కీర్తి వాసన్ మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు.