
ట్రైన్ నుంచి జారిపడి సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు గాయాలు
రాయగడ: ట్రైను నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గాయాలు తగిలిన వ్యక్తి శరత్ మాఝిగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రాయగడ సీఆర్‌పీఎఫ్ బృందం సంఘటనా స్థలంకు చేరుకుని గాయపడిన మాఝిని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రౌర్‌కలా–జగదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లొ కొరాపుట్ నుంచి బలంగీర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో లెల్లిగుమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో జవాన్ అదుపుతప్పి నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో గాయాలకు గురయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతనికి జిల్లా కేంద్రాస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.