
గ్రామానికి చేరుకున్న మృతదేహాలు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమయలారం వద్ద రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు స్వగ్రామానికి వచ్చాయి. నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి భిక్ష పంచాయతీ కొదాబట్ట గ్రామానికి అంబులెన్సులు వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన కృష్ణగౌడ కుమారుడు రమేష్ గౌడ (22), హరిశ్చంద్ర బోత్ర కుమారుడు చైతు బోత్ర (23)లు ఈ ఘటనలో మృతి చెందారు. ఇదే ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఆ పరిశ్రమలో పని చేస్తుండగా, ఆరోజు వీరిద్దరూ విధులకు వెళ్లడంతో మృత్యువాతపడ్డారు. వీరి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మజ్జి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. సంబంధిత కంపెనీ ప్రతీ మృత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. వీరి మృతదేహాలు వస్తున్న విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి వందలాది గిరిజనులు తరలివచ్చారు. ఇద్దరి మృతదేహాలకు ఒకేచోట అంత్యక్రియలు చేపట్టారు.

గ్రామానికి చేరుకున్న మృతదేహాలు