
బాల్య వివాహం నిలిపివేత
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో బాల్య వివాహాన్ని స్థానిక సీడీపీవో అడ్డుకున్నారు. బొయిపరిగుడ సమితి కోలనీగుడ గ్రామంలో బాల్య వివాహం జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో సీడీపీవో సబిత బ్రహ్మ సమితి అధికారులు, పోలీసులతో శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. వివాహానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకొని బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు బొరిగుమ్మ సమితి కెందుపడ ప్రాంతంలో +2 చదువుతున్న బాలికకు బొయిపరిగుడ ప్రాంతం కోలనీగుడలో 17 ఏళ్ల బాలుడుతో వివాహం నిర్ణయించారు. కొద్దిరోజుల కిందట బాలికను పెండ్లి కుమారుడు తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం బాలికకు అక్కడ పెళ్లి చేస్తుండగా విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న సీడీపీవో సబితా బ్రహ్మ సమితి అధికారులు, పోలీసులతో చేరుకొని ఉభయ వర్గాల వారిని సమావేశ పరిచారు. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేక
మని, చిన్న వయసులో పెళ్లితో అనేక అనర్థాలు ఉంటాయని వివరించారు. తొలుత వారు అంగీకరించలేదు. బాల్య వివాహాలపై వివరించి అవగాహన కల్పించడంతో పెళ్లి నిలిపేసేందుకు సమ్మతించారు. అమ్మాయికి 18 , అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఉభయవర్గాల సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ నందినీ స్వై, కెందుపడ అంగన్వాడీ వర్కర్ మధుస్మిత ధల్, బొయిపరిగుడ అంగన్వాడీ వర్కర్ తులసీ చలాన్, బొయిపరిగుడ పోలీసు కానిస్టేబుల్ కౌశల్య రొంధారి పాల్గొన్నారు.