
ఘోరం..!
● రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని రామనగుడ సమితి గుమడలోని వంశధార నది బ్రిడ్జిపై మంళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు పద్మపూర్ సమితి డెరిగా పంచాయతీలోని కొయిఠొగుడ గ్రామానికి చెందిన సుభత్ సొబొరొ(15), బులు సొబొరొ(19), జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణ హికక (22)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న గుమడ పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభత్, బులు, బాలకృష్ణలు ఒక బైకుపై భామిని పంచాయతీలోని కెరిని గ్రామంలో జరుగుతున్న అమ్మవారి పండగను చూసేందుకు తమ గ్రామాల నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరారు. అయి తే వీరిని గుమడ సమీపంలోని వంశధార నది బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయాలకు గురైన ముగ్గురు సంఘటన స్థలం వద్దే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఢీకొని వెళ్లిన వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.