
పొహండి నిర్వహణలో సంస్కరణలు
భువనేశ్వర్:
పూరీ శ్రీ జగన్నాథ స్వామి వార్షిక రథ యాత్ర సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. యాత్ర నిర్వహణలో ఛొత్తీషా నియోగుల పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం ఛొత్తీషా నియోగుల సమావేశం విజయవంతంగా ముగిసింది. రాజేంద్ర అభిషేకం మొదలుకొని నీలాద్రి విజే వరకు కార్యక్రమాల ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఈ ఏడాది స్నాన యాత్ర, రథ యాత్ర, బహుడా యాత్ర కార్యాచరణ ఈ సమావేశంలో ప్రధానాంశాలుగా చర్చించినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం మందిరం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఏడాది కార్యాచరణలో స్వల్ప సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. గత ఏడాది గుండిచా యాత్ర పురస్కరించుకుని నిర్వహించిన అడప పొహండిలో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. బలభద్రుని మూల విరాట్ నేలకొరిగిన విషయం విదితమే. ఇదో దుర్ఘటనగా భక్త జన హృదయాల్ని కలచి వేసింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా నివారించేందుకు సమావేశానికి హాజరు అయిన సేవాయత్ ప్రతినిధులు పలు ప్రతిపాదనలపై చర్చించారు. ప్రధానంగా దైతపతి, ఛొత్తీషా నియోగుల సంఘం ప్రముఖుల ప్రతిపాదనలపై లోతుగా చర్చించారు. యాత్ర ఆద్యంతాల్లో మూల విరాట్ల తరలింపు పొహండిపై ప్రత్యేక శ్రద్ధతో దృష్టి సారించాలని వీరంతా ప్రతిపాదించారు. స్నాన యాత్రలో జల అభిషేకం అత్యంత పవిత్రమైనది, ప్రముఖమైనది. ఈ సందర్భంగా అభిషేక మండపానికి జలం తరలిస్తున్న పాత్రలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన క్రమశిక్షణ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. భక్తులకు సులభ దర్శనం కోసం అనుబంధ సేవాయత్ వర్గీయులు పూర్తి సహకారం అందజేస్తామని సమావేశంలో హామీ ఇచ్చారు. స్నాన యాత్ర, రథ యాత్ర, బహు డా యాత్ర, నీలాద్రి విజే ఉత్సవాల నిర్వహణపై ప్రధానంగా సమయ పాలన, క్రమశిక్షణకు సంబంధించి విస్తారంగా చర్చించారు. నవ యవ్వన దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చర్చనీయాంశంగా పేర్కొన్నారు.
పొహండి సంస్కరణ
మూల విరాటుల తరలింపు పొహండి అత్యంత కీలకమైన ఘట్టం. ఈ కార్యాచరణలో సరికొత్త సంస్కరణకు ఛొత్తీషా నియోగుల సమావశంలో ఆమోదం లభించింది. ఒక్కో మూల విరాటు కోసం ప్రత్యేకంగా ఒక్కో సీనియర్ అధికారి, శ్రీ మందిరం పోలీసులుని నియమిస్తారు. పొహండికి ముందుగానే రథాలకు చారుమళ్ల అమరిక పటిష్టంగా పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియని దైతపతి సేవాయత్‌లు, బాడొగ్రాహి సేవాయత్‌లు, భొయి సర్దారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రథాలకు చారుమళ్ల ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ వర్గాలు జాగ్రత్త వహిస్తాయి. నిర్ధారిత వేళల ప్రకారం ఆలయ ఆచా ర వ్వహారాలతో యాత్ర కార్యకలాపాలు ముగించి యాత్ర నిర్విఘ్నంగా విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలు భక్తి భావంతో పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సమావేశంలో అభయం ఇచ్చారని శ్రీ మందిరం సీఏఓ తెలిపారు.
త్వరలో కొత్త పాలక మండలి
త్వరలో శ్రీ మందిరం కొత్త పాలక మండలి ఏర్పా టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త మండలి ఏర్పాటయ్యేంత వరకు అధికారిక వర్గాల ప్రతినిధుల ఆధ్వర్యంలో పాలక మండలి కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయని సీఏఓ తెలిపారు. పూరీ గజపతి మహా రాజా దివ్వ సింగ్ దేవ్ అధ్యక్షుడు, శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు, భారత పురావస్తు శాఖ ప్రముఖులు తదితర వర్గాల ఆధ్వర్యంలో పాలక మండలి కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు.