
రాయగడలో భారీ వర్షం
రాయగడ: రాయగడ పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. కాగా జోరు వానలో కూడా చాలామంది ఆటోల్లో ప్రమాదకరంగా తడు స్తూ ప్రయాణించడం కనిపించింది.
రేపు రాయగడలో మంత్రి కృష్ణ చంద్రపాత్రో పర్యటన
రాయగడ: రాష్ట్ర పౌరసరఫరాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కృష్ణ చంద్ర పాత్రో ఈ నెల 23వ తేదీన రాయగడలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు స్థానిక డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో కొత్తగా నమోదైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు స్థానిక మున్సిపాలిటీ అడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝికి సన్మానించే కార్యక్రమాన్ని వీక్షిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు బాకురుగుడలో నిర్మించిన ప్లానిటోరియాన్ని, 4.30 గంటలకు మెగా ఫుడ్ పార్క్‌ను సందర్శిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి స్థానిక ప్రభుత్వ సర్‌క్యూట్ హౌస్‌కు చేరుకుని కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి 8.50 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్ నుంచి జున్నాగడ్ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ వెళ్తారు.
గడ్డివాములు దగ్ధం
కాశీబుగ్గ: పలాస మండలం అమలకుడియా పంచాయతీ పూర్ణభద్ర గ్రామ సమీపంలో గడ్డివాములను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తగలబెట్టారు. గ్రామానికి చెందిన కాయల హరికృష్ణతో పాటు మరో రైతుకు చెందిన ఐదెకరాల గడ్డివాములు ఈ ఘటనలో కాలిబూడిదయ్యాయి. పశువులకు ఏడాదిపాటు సరిపడా గడ్డివాములు దగ్ధం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
సిక్కోలు విద్యార్థులకు
షైనింగ్ స్టార్ అవార్డులు
బూర్జ/మందస/జలుమూరు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వీరంతా మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. అవార్డులు అందుకున్న వారిలో మంద స మండలం హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జ్యోషిత(597), బూర్జ మండలం ఓ.వి.పేట మోడల్ స్కూల్ విద్యార్థి బుడుమూరు ఉదయకిరణ్(593), జలుమూరు మండల కరవంజ మోడల్ స్కూల్ విద్యార్థిని రావాడ హేమశిరీష(592) ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం లభ్యం
రణస్థలం: మండలంలోని మెంటాడ పంచాయతీ దోనిపేట సముద్రంలో గల్లంతైన నిద్రబంగి సంతోష్ మృతదేహం అదే ప్రాంతంలో బుధవారం లభ్యమైంది. నారువ గ్రామానికి చెందిన సంతోష్ (31)తో పాటు ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ మంగళవారం సముద్ర స్నానానికి వెళ్లగా అందులో సంతోష్ గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మృతదేహం ఒడ్డుకు రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌లో శవపంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు.
జీడి పంటకు గిట్టుబాటు
ధర కల్పించాలి
కాశీబుగ్గ: జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాలు వద్ద కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జీడి రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర, జీడి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభు త్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.
27న అమరవీరుల స్మారక సభ
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధరైతాంగ పోరాటంలో అమరులైన అమర వీరుల స్మారక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం స్మారక సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మే 27న బొడ్డపాడులో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సంఘాల నాయకులు జోగి కోదండరావు, వంకల మాధవరావు, దుష్యంతు, రామారావు పాల్గొన్నారు.

రాయగడలో భారీ వర్షం