
9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు 9.2 కిలోల గంజాయి తరలిస్తున్న గమేష్‌నాయిక్ అనే వ్యక్తిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం పట్టణ పొలీసులు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు జరుపుతుండగా గమేష్‌నాయిక్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 9.2 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గేరేగేడి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణకు డబ్బులు చాలక గంజాయి రవాణాకు దిగాడు. కంధమల్ జిల్లా తిలోరి గ్రామానికి చెందిన అజిత్‌ప్రధాన్, సుభాష్‌ల వద్ద కిలో గంజాయి రూ.రెండు వేలకు కొని మైసూర్‌లో బబ్లూకుమార్‌కు కిలో రూ.పది వేలకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ తనిఖీలలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.