
సరికొత్త అవకాశాలు సృష్టించాలి
భువనేశ్వర్: సాంకేతికత ఆవిష్కరణలకు పరిమితం కాకుండా మానవాళి సాధికారతకు దోహదపడి సంక్లిష్ట అడ్డంకుల్ని అధిగమించి, సరికొత్త అవకాశాలను సృష్టించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవ వేడుక మరియు స్థానిక ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) 64వ వార్షిక సాంకేతిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు దేశ సాంకేతిక నైపుణ్యత యాత్రలో మే 11, 1998 అత్యంత కీలకమైన దినంగా పేర్కొన్నారు. భారతదేశం ఆపరేషన్ శక్తి కింద పోఖ్రాన్‌లో అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని, మన దేశాన్ని అణ్వాయుధ దేశాల ఉన్నత సమూహంలో ఉంచిందని చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేశారు. ఈ పరీక్షలు భారతదేశ శాసీ్త్రయ పరాక్రమాన్ని మరియు స్వదేశీయంగా అభివృద్ధి చెందిన అణు సాంకేతికతను ప్రదర్శించాయన్నారు. జాతీయ సాంకేతిక దినం భారతదేశ ఆవిష్కరణల ధైర్యానికి, నాయకత్వ స్ఫూర్తి పునరుద్ఘాటన వేడుకగా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణ లక్ష్యంతో కృషి చేస్తున్న తరుణంలో అంతరిక్ష అన్వేషణ నుంచి వాతావరణ మార్పులు వరకు మన ఆకాంక్షలకు సాంకేతికత వెన్నెముక అన్నారు.
పరిశోధనల పాత్ర కీలకం
జాతీయ అభివృద్ధిలో ఆవిష్కరణలు, పరిశోధనల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, యువకులు కలలు సాకారం చేసుకునే దిశలో ఆవిష్కరణలు చేసి సమగ్రతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కృష్ణచంద్ర పాత్రో, దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రని ప్రస్తావించారు. విద్యార్థులు మరియు యువతలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను పేర్కొన్నారు. ఇండియా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) అధ్యక్షుడు వి.బి.సింగ్ కూడా సభలో ప్రసంగించారు. ఐఈఐ రాష్ట్ర శాఖ చైర్మన్ ప్రొఫెసర్ (డాక్టర్) సుధాంశు శేఖర్ దాస్, కార్యదర్శి సంగ్రామ్ కేశరి పట్నాయక్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం సంస్థ వార్షిక సంచికని ఆవిష్కరించారు.
గవర్నర్ హరిబాబు కంభంపాటి
ఘనంగా సాంకేతిక దినోత్సవం

సరికొత్త అవకాశాలు సృష్టించాలి

సరికొత్త అవకాశాలు సృష్టించాలి