
సురక్షిత రథయాత్రే లక్ష్యం
● డీజీపీ యోగేష్ బహదూర్
భువనేశ్వర్: ఈ ఏడాది పూరీలో సురక్షితంగా రథయాత్ర నిర్వహించడమే లక్ష్యమని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా అన్నారు. రథయాత్ర సన్నాహాలు సమీక్షించేందుకు ఆయన సోమవారం పూరీ ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీమందిరంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్ర సజావుగా నిర్వహించడంలో భక్తజన సమూహ నియంత్రణ, వ్యూహాత్మక వాహనాల రవాణా వ్యవస్థ, ప్రముఖుల కదలిక మధ్య దర్శనం క్రమబద్ధీకరణ అత్యంత కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఆద్యంతాలు రథాలు లాగడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. అనంతరం పూరీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు సీనియర్ అధికారులతో లోతైన చర్చలు జరిపారు.
శ్రీమందిరం భద్రత వ్యవస్థ సమీక్ష
ఈ సందర్భంగా డీజీపీ శ్రీమందిరంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధానంగా ఆధునిక భద్రతా మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించారు. భద్రతా సమీక్షలో జనసమూహ నిర్వహణ వ్యూహాలు, సీసీటీవీ నిఘా కవరేజ్, శీఘ్ర ప్రతిస్పందన బృందాలు, స్థానిక పాలన యంత్రాంగంతో సమన్వయం యొక్క వివరణాత్మక విశ్లేషణతో భద్రతా కార్యకలాపల్ని సమీక్షించారు. రథయాత్రకు అశేష సంఖ్యలో తరలివచ్చే ప్రతీ భక్తుడు, యాత్రికుని భద్రత, రక్షణపై సమగ్ర యంత్రాంగం అంకితభావంతో కృషి చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య శ్రీమందిరం ప్రాంగణాల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఆలయం చుట్టుపక్కల కనీసం 240 మంది పోలీసు సిబ్బందిని ఉంచారు. 4 మంది సభ్యుల జాతీయ భద్రతా గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండోల బృందం వార్షిక భద్రతా సమీక్షలో భాగంగా రథయాత్రతో సహా ప్రధాన పండుగల సమయంలో ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు రద్దీ నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ పరిస్థితులను తరచూ సమీక్షిస్తు సమయానుకూలమైన చర్యలతో భద్రతా వ్యవస్థని వ్యూహాత్మక పటిష్టపరిచే దిశలో సమగ్ర యంత్రాంగం కృషి చేయాలని సూచించారు.

సురక్షిత రథయాత్రే లక్ష్యం