
భాష భావ వ్యక్తీకరణకు మూలం
భువనేశ్వర్: భాష భావ వ్యక్తీకరణకు మూలమని సీఎం మోహన్‌చరణ్ మాఝీ అన్నారు. మయూర్‌భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్ పరిధిలోని మొహుళొడిహా ప్రాంతంలో సంతాలి భాషకు చెందిన అల్‌చికి లిపి శత వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. అల్‌చికి లిపి ఆవిష్కర్త గురు గోమ్కే పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి సందర్భంగా వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దండ్ బోస్ ప్రాంతంలో పండిట్ రఘునాథ్ ముర్ము నివాసాన్ని స్మారక తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని, ఆయన సమాధి స్థలానికి చారిత్రక స్మారక స్థలం హోదా కల్పిస్తామని ప్రకటించారు. అల్‌చికి లిపి శత వార్షికోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఒక ఏడాది పాటు నిరవధికంగా నిర్వహిస్తామన్నారు. సంతాలి భాషను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రూ.50 కోట్లతో భాష ప్రాచుర్యం
పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన అన్ని పుస్తకాలు ప్రాచుర్యం పొందేలా చేయడానికి బరిపదలో అల్‌చికి లైబ్రరీ, పండిట్ రఘునాథ్ ముర్ము ఓపెన్ థియేటర్ మ్యూజియం మరియు తన కార్యాలయంలో ఒక వారసత్వ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాల సమగ్ర వ్యయ ప్రణాళిక రూ.50 కోట్ల ప్యాకేజీగా తెలియజేశారు. పండిత్ రఘునాథ ముర్ము రచనలు కేవలం అక్షర జ్ఞానానికి పరిమితం కాలేదని, సాంస్కృతిక పురోగతిలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కరించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ లిపికి, సంతాలి భాషకు నిరంతరం ప్రత్యేక ప్రాధాన్యతతో మద్దతు ఇస్తుందని
సీఎం మోహన్ చరణ్ మాఝీ
ఘనంగా అల్‌చికి లిపి శత వార్షికోత్సవం
హామీ ఇచ్చారు. ప్రాథమిక విద్యలో సంతాలి భాషా సంస్థలను స్థాపించడం, పాఠ్యపుస్తకాల ప్రచురణ, ఉపాధ్యాయులకు శిక్షణ మరియు భాషా అభివృద్ధి కేంద్రాలను సృష్టించడం ద్వారా ఉజ్వల భవిష్యతు ఆవిష్కరణకు బలమైన మార్గం సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు.
అద్భుతమైన వ్యక్తి రఘునాథ్ ముర్ము
కార్యక్రమానికి హాజరైన ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ పండిత్ రఘునాథ్ ముర్ము ఒక అద్భుతమైన వ్యక్తిగా కీర్తించారు. అతను నిరంతరం సుగంధం వెదజల్లే భాషా పుష్పమని కొనియాడారు. రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి విభాగం మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపాత్రో పండిట్ ముర్మును విశేష శక్తులు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. అటవీ, పర్యావరణ మంత్రి గణేష్‌రామ్ సింగ్‌కుంటియా తన ప్రసంగంలో ఈ పండుగ కారణంగా నేడు చరిత్ర పునరుద్ధరించబడిందన్నారు. అనంతరం ప్రఖ్యాత సంతాలి భాషా పరిశోధకుడు చుండా సోరెన్‌కు గురు గోమ్కే అంతర్జాతీయ అవార్డుతో పాటు రూ.1 లక్ష నగదు పురస్కారాన్ని సీఎం ప్రదానం చేశారు. పండిట్ ముర్ము వారసుడు చునియన్ ముర్ము, ప్రఖ్యాత సంతాలి రచయిత్రి, పద్మశ్రీ డాక్టర్ దమయంతి బేషారాను సత్కరించారు. కార్యక్రమంలో మయూర్‌భంజ్ జిల్లా ఎంపీలు మమతా మహంత, నవచరణ్ మాఝీ, రాయ్‌రంగ్‌పూర్ ఎమ్మెల్యే జలెన్ నాయక్, సొరొసొకొణా ఎమ్మెల్యే భాదవ్ హంసదా, కరంజియా ఎమ్మెల్యే పద్మచరణ్ హైబురు, బరిపద ఎమ్మెల్యే ప్రకాష్ సోరెన్, బొడొసాహి ఎమ్మెల్యే సనాతన్ బిజులి, బంగిరిపోషి ఎమ్మెల్యే సంజిలి ముర్ము, పండిత్ రఘునాథ ముర్ము ట్రస్టు కార్యదర్శి ఇంజినీరు విశ్వేశ్వర టుడు తదితరులు పాల్గొన్నారు.