
దొంగతనం కేసులో బాలుడు అరెస్టు
జయపురం: వాహన షెడ్‌లో టైర్లు, ఇంజిన్ సామానులు దొంగిలించిన బాలుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్ శనివారం వెల్లడించారు. అతడిని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు మల్కనగిరి బాలల రక్షణ గృహానికి తరలించినట్లు పట్టణ పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడి నుంచి దొంగిలించిన టైర్లు, ఇతర సమానులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. గాంధీ చౌక్‌లో గల ఒక నాలుగు చక్రాల షోరూమ్ గిడ్డంగిలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన గిడ్డంగిలో ఉన్న నాలుగు కొత్త టైర్లు, రిమ్ములు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం జనవరి 22వ తేదీన యజమాని తెలుసుకున్నాడు. ఆ షోరూమ్ యజమాని దొంగనంపై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన వాటి విలువ రూ.50 వేలు ఉంటుందన్నారు. దొంగతనం సీసీ కెమారాలలో రికార్డు అయింది. పోలీసుల దర్యాప్తులో వివిధ సమయాలలో జరిగిన దొంగతనాలు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు గిడ్డంగి నుంచి ఇనుప రేంపులు, పలు రిమ్ములు, 50కి పైగా టైర్లు దొంగిలించబడ్డాయి. వాటి విలువ రూ.5 లక్షల 50 వేలకు పైనే ఉంటుందని షోరూమ్ యజమాని తెలిపారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపగా బాలుడిని వద్ద 4 టైర్లు, రిమ్ము, ఇతర వస్తువులు లభించాయని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.