
విమానాశ్రయంలో బ్యాగ్ కలకలం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. విమానయాన ప్రయాణికులతో పాటు అధికారులు, భద్రతా దళాలను సైతం పరుగులు తీయించింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో స్థానిక విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంతలో విమానాశ్రయం ప్రాంగణంలో అనుమానాస్పద బ్యాగ్ ప్రయాణికుల దృష్టికి వచ్చింది. వెంటనే భద్రతా అనుబంధ వర్గాల దృష్టికి చేరింది. లగేజీ ట్రాలీలో బ్యాగ్ ఉన్నట్లు గుర్తించి నిఘా జాగిలం (స్నిఫర్ డాగ్), బాంబ్ స్క్వాడ్ బృందాల్ని రంగంలోకి దించారు. అనంతరం పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేయగా బ్యాగు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వచ్చిన మహిళా ప్రయాణికురాలిదిగా తేలింది. ఆమె విమానాశ్రయానికి తిరిగి వచ్చి తన సామాను కోసం వెతకడంతో గందరగోళం వీడింది. అందులో కొన్ని డైపర్లు, మొబైల్ ఛార్జర్ ఉన్నాయి. అనంతరం బ్యాగ్‌ను మహిళకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

విమానాశ్రయంలో బ్యాగ్ కలకలం